News

పాక్‌ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా

370views

వాషింగ్టన్: పాక్‌పై బైడెన్‌ చేసిన విమర్శలకు సర్దిచెప్పుకొనే యత్నాలను అమెరికా మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌.. బైడెన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ”అణ్వాయుధ రక్షణ విషయంలో పాక్‌ నిబద్ధత, సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకముంది. సుసంపన్న, సురక్షిత పాకిస్తాన్.. అమెరికా ప్రయోజనాలకు చాలా కీలకం. అంతేకాదు.. దీర్ఘకాలంగా పాక్‌తో ఉన్న సహకారాన్ని గౌరవిస్తాం” అని వివరణ ఇచ్చుకొన్నారు.

ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ పాకిస్థాన్‌లో అణుభద్రతపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ”ప్రపంచంలో పాకిస్థాన్‌ అత్యంత ప్రమాదకరమైన దేశం. అలాంటి బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. బైడెన్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికా రాయబారికి పాకిస్తాన్ సమన్లు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పందిస్తూ.. నేరుగా బైడెన్‌, అమెరికాను లక్ష్యంగా చేసుకొన్నారు. తమకు అత్యంత సురక్షితమైన న్యూక్లియర్‌ కమాండ్‌ ఉందని, అమెరికా వలే తాము యుద్ధాల్లో మునిగిపోలేదని ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ట్విటర్‌లో స్పందిస్తూ.. తమది అత్యంత బాధ్యతాయుతమైన అణుదేశమని వెల్లడించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి