News

కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌.. ఏడుగురి మృతి

378views

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాప్టర్‌ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్‌ చట్టీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

గుప్త్‌కాశీ నుంచి కేదార్‌నాథ్‌కు యాత్రికులతో బయల్దేరిన ఈ హెలికాప్టర్‌.. టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు పైలట్‌ కాగా.. ఆరుగురు యాత్రికులు. దట్టంగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన ట్విటర్‌లో తెలిపారు. అటు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి కూడా ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి