
న్యూఢిల్లీ: భారత దేశంలో ఆకలికేకలు ఏటికేడు పెరుగుతున్నాయనీ, పోషకాహార లోపం తీవ్రమవుతుందని సూచిస్తూ విడుదలైన ప్రపంచ ఆకలి సూచీ 2022 రేటింగ్ ను భారత దేశం తిరస్కరించింది. దేశం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో ఇదో భాగమని అభ్యంతరం వ్యక్తం చేసింది. సూచీ తయారీలో అనుసరించిన పద్దతుల పట్ల ఆక్షేపం వ్యక్తం చేస్తూ ఇది “ఆకలి తప్పుడు కొలత” అని ప్రభుత్వం విమర్శించింది.
“కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్ట్ హంగర్ హిల్ఫ్, ఐర్లాండ్ , జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థలు వరుసగా విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీ నివేదిక 2022, 121 దేశాలలో భారతదేశానికి 107వ ర్యాంక్ ఇచ్చింది. ఈ సూచిక ఆకలి తప్పు కొలత, తీవ్రమైన పద్దతి సమస్యలతో బాధపడుతోంది” అని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విమర్శించింది.
జూలై 2022లో ఎఫ్ఐఇఎస్ (ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఎక్స్‌పీరియన్స్ స్కేల్) సర్వే మాడ్యూల్ డేటా ఆధారంగా అటువంటి అంచనాలను గణాంక అవుట్‌పుట్‌గా ఉపయోగించకూడదని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపింది. అటువంటి విధానం వాస్తవాలకు అనువుగా ఉండబోదని స్పష్టం చేసింది.
ఈ సమస్యపై తదుపరి సమాలోచన జరుగుతుందని హామీ వచ్చినప్పటికీ, అటువంటి వాస్తవ పరిశీలనలతో సంబంధం లేకుండా ప్రపంచ సూచీ నివేదికను ప్రచురించడం పట్ల మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.
ఈ నివేదికలో 121 దేశాలలో భారతదేశం 107వ స్థానంలో ఉండడంతో పాటు, దాని పిల్లల వృధా రేటు 19.3 శాతంతో ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. “ఆహార భద్రత, దాని జనాభా పోషకాహార అవసరాలను తీర్చలేని దేశంగా పేర్కొంటూ భారతదేశం ప్రతిష్టను దెబ్బతీసేందుకు స్థిరమైన ప్రయత్నం మళ్లీ కనిపిస్తుంది. తప్పుడు సమాచారం ఏటా విడుదల చేయడం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ముఖ్య లక్షణంగా కనిపిస్తోంది” అని మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Source: Nijamtoday





