News

కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన… కేంద్రం ఆమోదం

506views

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సోమశిల వద్ద కృష్ణానదిపై కేంద్రం ప్రభుత్వం వంతెన నిర్మించనుంది. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెనగా ఈ వారధి నిలిచిపోతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఐకానిక్‌ వంతెన రూపు రేఖల ఫొటోలను గడ్కరీ ట్విటర్‌లో పంచుకున్నారు.

15 ఏళ్ళ చిరకాల స్వప్నం

ప్రపంచంలో రెండోవ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని గడ్కరీ తెలిపారు. వంతెనలో పాదచారుల మార్గం గాజుతో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గోపురం ఆకారంలో పైలాన్‌, లైటింగ్ వ్యవస్థ ఉంటుందన్నారు. చుట్టూ నల్లమల అడవులు, ఎత్తైన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్‌ పరిసరాలతో ఈ వంతెన మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ వంతెన నిర్మాణంతో ఎట్టకేలకు 15 ఏళ్ళ చిరకాల స్వప్నం సాకారం కానుంది.

పడవ ప్రయాణమే శరణ్యం

తెలంగాణలోని కొల్లాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించాలంటే కృష్ణానదిలో పడవ ప్రయాణమే శరణ్యం. రెండు రాష్ట్రాల మధ్య రహదారి మార్గంలో రాకపోకలు సాగించాలంటే సుమారు వంద కిలోమీటరు చుట్టుతిరిగి రావాల్సిందే. 2007లో కృష్ణానదిలో పడవ మునగటంతో 61మంది జలసమాధి అయ్యారు. కృష్ణ నదిపై వంతెన నిర్మించాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ఈ క్రమంలోనే వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.

ఇక చుట్టుతిరిగి వెళ్లాల్సిన పనిలేదు

వంతెనకు అనుసంధానంగా తెలంగాణలోని కల్వకుర్తి-నాగర్‌కర్నూల్‌-కొల్లాపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్‌-నంద్యాల మార్గాన్ని కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారిగా గుర్తించింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టుతిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వంతెన ఏర్పాటుతో హైదరాబాద్‌- తిరుపతి మధ్య 80 కిలో మీటర్ల దూరం తగ్గనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి