
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు జరిపింది. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో దాడులు జరిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.
అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు అరబ్ దేశాల నుంచి హవాలా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు అందుతున్నట్టు భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ముకశ్మీర్‌లోని అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యాలయాలపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. రాజౌరీ, పూంచ్, జమ్ము, శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, షోపియాన్, బందిపోరా జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి.
ఈ విద్యాసంబంధమైన ట్రస్ట్‌ను అడ్డం పెట్టుకుని అనుమానాస్పద కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి పనులకు పూనుకుంటున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఎన్‌ఐఏ అధికారులు ట్రస్టు సభ్యుల ఇళ్ళల్లోనూ సోదాలు చేశారు.
జమాత్-ఏ-ఇస్లామీ ఫ్రంటల్ యూనిట్‌గా అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 2019 లో జమాత్-ఏ-ఇస్లామీ సంస్థను ఉపా చట్టం కింద చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తమకు అందిన సమాచారం ఆధారంగా ఎన్‌ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్ చేసినట్టు సమాచారం లేదు. దాడులను అధికారులు ధ్రువీకరిస్తున్నా ఎవర్ని అదుపులోకి తీసుకున్నది మాత్రం అధికారులు వెల్లడించలేదు.
Source: Nijamtoday