News

శ్రీశైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు

388views

అమరావతి: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకున్న‌ట్టు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో గురువారం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. దేవస్థానం అభివృద్దికై మాస్టర్ ప్లాన్ తయారీ చేసేందుకు, తర అభివృద్ది పనులను చేపట్టేందుకు దేవస్థానం భూముల సరిహద్దులు ఇప్పటి వరకూ సరిగా ఖరారు కాకపోవడం పెద్ద ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమీక్షా సమావేశం నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు.

బ్రిటీష్ పరిపాలనా కాలం 1879 సంవత్సరం ప్రాంతంలో 7 స్క్వేర్ మైళ్ళ భూమి అంటే దాదాపు 4,130 ఎకరాల భూమిని శ్రీశైల దేవస్థానానికి కేటాయించిన‌ట్టు తెలిపారు. అదే విధంగా 1967 ప్రాంతంలో మరో 145 ఎకరాల భూమిని ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. అయితే నాగార్జున సాగర్ – శ్రీ శైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో ఈ దేవస్థానం భూములు ఉండటం చేత ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ భూముల సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు.

అక్టోబరు నెలాఖరులోపు ఈ దేవస్థానం భూముల సరిహద్దుల ఖరారు ప్రక్రియ పూర్తియిన వెంటనే దేవస్థానం అభివృద్దికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి