
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్ కేవడియాలోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్.వి.సుతార్ రాముడి ప్రతిమ సృష్టికీ సారథ్యం వహించనున్నారు. లతా మంగేష్కర్ చౌక్ అభివృద్ధి పనుల కోసం కుమారుడు అనిల్‌తో కలిసి ప్రస్తుతం అయోధ్యలో సుతార్ఉన్నారు.
రాముడి విగ్రహం 251 మీటర్లు ఎత్తు ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉన్న పటేల్ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'(182 మీటర్లు) కన్నా ఇది 69 మీటర్లు పెద్దది.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం రూపకల్పన కోసం 1000 మంది శిల్పులు మూడున్నర ఏళ్లపాటు శ్రమించారు. అయోధ్యలోని రాముడి ప్రతిమ కోసం 2వేల మంది దాదాపు నాలుగేళ్ల పనిచేయాల్సి ఉంటుందని అంచనా వేశారు రామ్ సుతార్ కుమారుడు అనిల్ సుతార్. సాహిబాబాద్‌లోని తమ కార్ఖానాలో విగ్రహం తయారీ పనులు చేపడతామని వెల్లడించారు.
Source: EtvBharat