News

ఉద్ధవ్ కు మరో షాక్

442views

* మహా సీఎం ఏక్ ‌నాథ్‌ శిండేని కలిసి మద్దతు తెలిపిన 12 రాష్ట్రాల శివసేన చీఫ్ లు.

 ఏక్ ‌నాథ్‌ శిండే తిరుగుబాటుతో శివసేనలో చీలిక తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీపై హక్కుల కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో పలువురు నేతలు శిండే శిబిరం వైపు వెళ్లిపోతున్నారు. తాజాగా 12 రాష్ట్రాల్లోని శివసేన చీఫ్ ‌లు ఏక్ ‌నాథ్‌ శిండేను కలిసి తమ మద్దతు ప్రకటించారు. దేశవ్యాప్తంగా శివసేనకు మొత్తంగా 15 రాష్ట్రాల్లో శాఖలుండగా 12 రాష్ట్రాలకు చెందినవారు మహారాష్ట్ర సీఎం ఏక్ ‌నాథ్‌ శిండేను కలవడం చర్చనీయాంశంగా మారింది. 12మంది శివసేన చీఫ్ ‌లు తనను కలిసిన ఫొటోలను ఏక్ ‌నాథ్‌ శిండే తన ట్విటర్‌లో పంచుకున్నారు.

”పలు రాష్ట్రాలకు చెందిన శివసేన ప్రాంతీయ చీఫ్ ‌లు బుధవారం సమావేశమయ్యారు. వారంతా మాకు మద్దతు ప్రకటించారు. దేశం నలుమూలలా శివసేన సంస్థాగత విస్తరణపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించాం. సమావేశమైన వారిలో ఢిల్లీ, మణిపూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, హైదరాబాద్, గోవా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర ప్రాంతీయ చీఫ్ ‌లు ఉన్నారు. వీరందరికీ తమ రాష్ట్రాల్లో పార్టీ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాం” అని శిండే ట్విటర్‌లో పేర్కొన్నారు. శివసేన పార్టీ గుర్తు తమదేనంటూ శిండే వర్గం వాదిస్తుండగా దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని నిరోధించాలని కోరుతూ ఉద్ధవ్‌ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ మరోవారం రోజుల్లో విచారణకు రానున్న తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

మరోవైపు, శివసేనలో చీలిక తర్వాత ఆ పార్టీపై హక్కుల కోసం ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్ ‌నాథ్‌ శిండే వర్గాలు తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. అసలైన శివసేన తమదేనంటూ శిండే వర్గం చెబుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని అభ్యర్థించింది. అయితే, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఠాక్రే వర్గం.. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున శిండే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది. దీనిపై వచ్చేవారంలో విచారణ జరగనున్న వేళ తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.