
రాజమహేంద్రవరం: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భారీ ఎత్తున వస్తున్న వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.20 అడుగులకు నీటిమట్టం చేరగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విలీన మండలాలు, లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సీజన్‌లో మూడోసారి గోదావరి నదికి వరదలు రావడంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి పరవళ్ళు తొక్కుతోంది.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి, పంట కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ ప్రాంతంలోని నదీ పాయల్లో ప్రవాహ ఒరవడి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదలడంతో గౌతమి, వశిష్ట, వైనతేయ.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు మరోసారి ముంపులో చిక్కుకున్నాయి.





