News

గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు

238views

దేశంలో మరో అతి పెద్ద డ్రగ్ రాకెట్ ‌ను పోలీసులు ఛేదించారు. భారత్ ‌లోకి డ్రగ్స్‌ సరఫరా చేయాలన్న పాకిస్థాన్‌ కుట్రల్ని భగ్నం చేశారు. గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌), కోస్ట్ ‌గార్డ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి రూ.200 కోట్లు విలువ చేసే 40కిలోల హెరాయిన్ ‌ను పట్టుకున్నారు.

పాకిస్థాన్‌ నుంచి ఫిషింగ్‌ బోటులో మాదకద్రవ్యాలను తరలిస్తుండగా సముద్ర మధ్యంలోనే మాటువేసి పట్టుకున్నట్టు ఏటీస్‌ సీనియర్‌ అధికారి వెల్లడించారు. బోటులో ఉన్న ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఫిషింగ్‌ బోట్ ‌ను కచ్‌ జిల్లాలోని జఖౌ హార్బర్ ‌కు సమీపంలో సముద్రంలోనే కోస్ట్‌ గార్డ్‌, ఏటీఎస్‌ బృందాలు అడ్డుకున్నాయని తెలిపారు.

ఈ మాదకద్రవ్యాలను గుజరాత్ ‌కు చేర్చిన తర్వాత అక్కడి నుంచి స్మగ్లర్లు రోడ్డు మార్గంలో పంజాబ్ ‌కు రవాణా చేయాలనుకున్నారని అధికారులు వెల్లడించారు. తమకు అందిన పక్కా సమాచారంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా పాకిస్థాన్‌ నుంచి బయల్దేరిన ఆ బోటును అడ్డుకున్నట్టు తెలిపారు. దాంట్లో ఉన్న 40కిలోల హెరాయిన్ ‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పడవతో పాటు ఏటీఎస్‌, కోస్ట్ ‌గార్డు అధికారులు ఈరోజు జాఖౌ తీరానికి చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.