
భారీ వరదలతో ఇటీవల బెంగళూరు నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ దుస్థితికి ఆక్రమణలూ ఓ కారణమని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం…. వాటిని తొలగించడంపై దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే బుల్డోజర్లను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో కొనసాగుతున్న అక్రమ కట్టడాలను నోయిడా ట్విన్ టవర్ల తరహాలో కూల్చేస్తామని హెచ్చరించారు. శాసన సభలో మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. సంబంధిత కట్టడాలకు అనుమతించిన అధికారులు, బిల్డర్లు శిక్షార్హులేనని అన్నారు. ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించే వరకూ ఈ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.
భారీ వర్షాలతో బెంగళూరు నగరం వరద కుంటలా మారింది. వాననీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. చెరువులు, మురుగు కాల్వల ఆక్రమణలే దీనికి కారణమని ప్రభుత్వం గుర్తించింది. నగరవ్యాప్తంగా 700కుపైగా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) అధికారులు లెక్కతేల్చారు. సెప్టెంబరు 12నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడి పదికిపైగా చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలకు ఆమోదం లభించిందని మంత్రి అశోక ఆరోపించారు. వరదల దుస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రణాళికారహిత పాలన కూడా కారణమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విమర్శించారు.





