News

జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక నిర్ణయం

204views

* కొనసాగనున్న శృంగారగౌరి మాత కేసు విచారణ

వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు విచారణపై అక్కడి జిల్లా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంగణంలో ఉన్న శృంగారగౌరి మాత విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ ‌ను విచారణ కొనసాగింపునకు న్యాయస్థానం అంగీకరించింది.పిటిషన్‌ విచారణార్హం కాదని మసీదు కమిటీ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

వారణాసి జిల్లా కోర్టు నిర్ణయంతో ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్‌ విచారణ ముందుకు సాగనుంది. ఇదిలాఉంటే, జ్ఞానవాపి కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గతంలోనే సర్వే పూర్తి చేసింది. ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి.. నివేదికను కోర్టుకు అందజేసింది. అనంతరం సర్వే నివేదికలోని అంశాలు బహిర్గతం కావడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.