News

అసొం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం!

366views

భాగ్య‌న‌గ‌రం: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అసొం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్‌ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్‌ఎస్‌ నేత నంద కిషోర్‌ వ్యాస్‌ దూసుకువెళ్ళారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్‌ లాగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్‌ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు.

అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్‌ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్ళిన నంద కిషోర్‌.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్‌ను బలవంతంగా స్టేజ్‌ కిందకు తీసుకుపోయారు.

అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్‌పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్‌ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్‌ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్‌ఎస్‌ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

  • హేయమైన చర్య … బండి సంజయ్

అసొం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్‌ఎస్‌ నేత మైక్‌ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ నేతను అరెస్ట్‌ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్‌ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అసొం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి