News

నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం

353views

బీజేపీ నుంచి సస్పెండయిన‌ నేత, న్యాయవాది నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్‌ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది.

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం మతస్తుల మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని ఓ పిటిషనర్‌, అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ‌ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ”ఆదేశాలు జారీ చేసేటప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్ ‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది” అని పిటిషనర్ ‌కు సూచించారు చీఫ్‌ జస్టిస్‌ యూయూ లలిత్‌. దీంతో పిటిషనర్ తన పిటిషన్ ను‌ వెనక్కి తీసుకున్నారు.

ముహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్‌ శర్మ కామెంట్లపై అరబ్‌ దేశాల నుంచి, భారత్‌ లోని వివిధ ఇస్లామిక్ మత సంస్థల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆమెను చంపేస్తామంటూ పలు వీడియోలు, ఫోన్లు, లేఖల ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తదుపరి పిటిషన్ ‌పై విచారణ సందర్భంగా మాత్రం సుప్రీం సానుకూలంగా స్పందిస్తూ… నూపూర్ శర్మకు అరెస్ట్‌ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్‌ ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.