
న్యూఢిల్లీ: ప‌్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు జరుపుతోంది. ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్‌తో పలు చర్చలు జరిపినట్టు ఎఫ్‌ఐఎస్ సీనియర్ డైరెక్టర్ జూలియా డెమిదోవా వెల్లడించారు.
ఆర్‌బీఐతో ఇప్పటికే పనిచేసిన అనుభవం తమకు ఉందని, సీఐఎస్ వ్యవస్థలతో సీబీడీసీ నిర్వహణ అవకాశాలను చూస్తున్నట్టు తెలిపారు. సీబీడీసీలపై అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకర్లతో రౌండ్‌టేబుల్ సమావేశాలు, వర్క్‌షాప్‌లను ఎఫ్‌ఐఎస్ నిర్వహిస్తున్నట్టు వివరించారు.
ఆఫ్‌లైన్ చెల్లింపులు, ప్రొగ్రామబుల్ చెల్లింపులు, కొత్త పరపతి విధాన టూల్‌కిట్, వడ్డీ రహిత సీబీడీసీ, ఫ్రాక్షనల్ బ్యాంకింగ్ సమస్యలు, అందరికీ ఆర్థిక సేవలు, సీమాంతర సీబీడీసీ చెల్లింపులపై కేంద్ర బ్యాంకులకు సలహాలు ఇస్తున్నట్టు డెమిదోవా తెలిపారు.
డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్టు సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీబీడీసీ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ నిర్వహణ కోసం 1934 ఆర్‌బీఐ చట్టంలో సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఛౌద్రీ ఇప్పటికే వెల్లడించారు. హోల్‌సేల్, రిటైల్ విభాగాల్లో సీబీడీసీని దశలవారీగా అమలు చేయాలని చూస్తున్నట్టు తెలిపారు.





