
న్యూఢిల్లీ: భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది మరో అడుగు అని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. ఇప్పటి వరకు ఇలాంటి విమాన వాహక నౌకలను అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే తయారు చేశాయని, ఈ లీగ్‌లో భాగం కావడం ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అడుగులు వేశాయని ప్రధాని మోదీ చెప్పారు.
“ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధ యంత్రం కాదు, భారతదేశపు నైపుణ్యం, ప్రతిభకు నిదర్శనం. ఇది ప్రత్యేకమైనది, విభిన్నమైనది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశంలోనే డిజైన్ చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో రూపొందించిన కొత్త నావికా దళ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు.
Source: Nijamtoday





