News

వరదల వేళ భారత్‌తో వాణిజ్య పున‌రుద్ధ‌ర‌ణ‌ కోసం పాక్ ఆరాటం

486views

న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావం అతితీవ్రంగా ఉండటంతో వరదల బారిన పడి అల్లాడుతున్న పాకిస్తాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించనున్నట్టు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ సోమవారం తెలిపారు.

వరదలు, పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్‌తో వ్యాపార మార్గాలను పునరుద్ధరించనున్నామని మంత్రి చెప్పినట్టు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ ఏడాది జూలై నుంచి అసాధారణ రుతుపవనాల కారణంతో పాకిస్తాన్‌ వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. దేశంలోని 3.3 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడినట్టు పాక్ పత్రిక ‘డాన్’ ఒక కథనం ప్రచురించింది.

ఐక్యరాజ్యసమితి, ఇతర మానవతా ఏజెన్సీల సహకారంతో మానవతా సహాయక చర్యలు చేపడుతున్నట్టు క్లైమైట్ ఛేంజ్ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. ఎనిమిది వారాలుగా కురుస్తున్న వర్షాలను దేశంలో మునుపెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. నౌషెరాలోని కాబూల్ నదిలో వరద స్థాయితో పాటు ఇండస్ వరద నీటి ప్రవాహం చాలా ఉద్ధృతంగా ఉందని చెప్పారు.

ఆహార, ఔషధ సరఫరా కూడా కష్టంగా మారుతోందని, ఎన్‌డీఎంఏ, పాకిస్థాన్ ఆర్మీ సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఎన్‌డీఎంఏ తాజా గణాంకాల ప్రకారం, ఈ వర్షాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి వర్షాలు, వరదల కారణంగా 1,061 మంది మృత్యువాత పడ్డారు. 1,575 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో, 11 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు సహా 29 మంది మృతి చెందగా, 48 మంది గాయపడ్డారు. 9,92,871 ఇళ్ళు, 170 వంతెనలు, 157 దుకాణాలు ధ్వంసమయ్యాయి.

ప్రధాని మోదీ ఆందోళన

పాకిస్థాన్‌లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి తాను బాధపడ్డానని, త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు.

“పాకిస్తాన్‌లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డాను. ఈ ప్రకృతి వైపరీత్యంలో బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి, బాధిత వారందరికీ మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. త్వరగా సాధారణ స్థితిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నాము” అని ప్రధాని మోదీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వాణిజ్య వర్గాల ఒత్తిడి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటుండడంతో పాకిస్థాన్ లోని వాణిజ్య వర్గాల నుండి కొద్దీ రోజులుగా భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవాలనే వత్తిడులను అక్కడి ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. పాకిస్తాన్ లోని అతిపెద్ద వ్యాపార సమ్మేళనం ఛైర్మన్ మియాన్ మొహమ్మద్ మన్షా గత వారం ​​ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ – పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రెండు దేశాల మధ్య ఇతరత్రా సంబంధాల మెరుగుదలకు ఇది దోహదపడగలదని కూడా పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి