
* తిరుమలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ
* వాటిని నమ్మొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి
కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే డబ్బు ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే తెలిపింది.
అలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని.. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై తితిదే అధికారులు తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. భక్తుల ఖాతాల్లో జమయ్యేందుకు కాస్త జాప్యం జరుగుతోందన్న తితిదే.. నాలుగైదు రోజుల్లో రిఫండ్ అయ్యేలా యూపీఐ విధానం తీసుకొచ్చినట్టు తెలిపింది.
బీటెక్ రవిపై కేసు నమోదు
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న బీటెక్ రవి.. వసతి గదుల డిపాజిట్ విధానంపై విమర్శలు చేశారు. గతంలో తాను చెల్లించిన రూ.3,500లు నెలలు గడిచినా తిరిగి ఇవ్వలేదన్నారు. ఈ డబ్బును ప్రభుత్వం వాడుకుంటోందని గదుల వద్ద ఉండే సిబ్బంది చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై తితిదే రిసెప్షన్ ఓఎస్డీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.