-
న్యాయమూర్తులకు మాజీ చీఫ్ జస్టిస్ రమణ హితవు
న్యూఢిల్లీ: సొంత లాభం కొంత మానుకొని, పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ పిలుపును న్యాయవ్యవస్థ స్ఫూర్తిమంత్రంగా భావించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. పేద ప్రజల గురించి ఆలోచించి, వారికి న్యాయాన్ని అందించాలని, అదే పరమావధిగా పనిచేయాలని కోరారు.
ప్రతీ పేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ రమణ సత్యమేవ జయతే అనేది తాను నమ్మే సిద్ధాంతమని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డానని వివరించారు. సీజేఐగా తన కర్తవ్య నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేసినట్టు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కొత్త ఒరవడి తెచ్చామన్న ఆయన, మౌలిక వసతుల కల్పనకు.. తన వంతు కృషి చేసినట్టు వివరించారు. ప్రతి తీర్పులోనూ ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించానని తెలిపారు. చివరిశ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.