
-
సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్
విజయవాడ: భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించిన హక్కుల పరిరక్షణతోపాటు వారి అభ్యున్నతికి పాటుపడడం… అలాగే, క్రైస్తవ, ఇతర మతాల మార్పిడిలు, హిందూ వ్యతిరేక శక్తుల నుంచి సంపూర్ణ రక్షణ కల్పించడం ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ప్రధాన లక్ష్యాలని సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
స్థానిక ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రెండు రోజుల రాష్ట్రస్థాయి సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ప్రారంభ సమావేశంలో శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు స్వార్థపరశక్తుల వల్ల సంపూర్ణంగా అందడం లేదని అన్నారు. కొంతమంది ఎస్సీ, ఎస్టీల హక్కులను అక్రమంగా అనుభవిస్తుండడంతో నిజమైన ఎస్సీ, ఎస్టీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పరశురామ్ ‘మన రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలకు, 35 గిరిజన తెగలకు అభివృద్ధి ఫలాలు అందాలి అంటే మనం ఏమి చేయాలి? అనే అంశంపై చర్చను నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుసి రాజు అధ్యక్షత వహించిన ఈ సమావేశాల్లో మొదటి రోజు ‘తెలుగు రాష్ట్రాలలో గిరిజనుల ఉద్యమాలు ఒక విశ్లేషణ’, మనమంతా సోదరులం, బంధువులం.. ఈ దిశలో 20వ శతాబ్దం తెచ్చిన మార్పులు, 21వ శతాబ్దంలో మన దిశ ఎటు?’ అనే రెండు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
కాగా, సామాజిక సమరసత పరిచయాన్ని రాష్ట్ర కన్వీనర్ రాగాల నరసింగరావు నాయుడు, ఎస్.ఎస్.ఎఫ్ సంస్థ పరిచయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు విష్ణువు, సంచార తెగల పనిని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్(రాష్ట్ర అధ్యక్షుడు), ఆర్.ఎస్.ఎస్.సంస్థ పరిచయాన్ని సహ్ క్షేత్ర ప్రచారక్ భరత్‌జీ వివరించారు. అక్రమ క్రైస్తవ ప్రచారంపై న్యాయ పోరాటం ఎలా చేయాలి? అనే దానిపై సంతోష్ మాట్లాడారు.





