
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్ భారత్ లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పుణెలోని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఈ డ్రోన్ ను తయారుచేసింది. తాజాగా దీని పనితీరును ప్రదర్శించింది. ఇది వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఈ డ్రోన్.. 130 కిలోల బరువు మోయగలదు. నౌకల మధ్య సరకులను రవాణా చేయగలదు. రక్షణ దళాలకు ఉపయోగపడుతుంది.
మనుషుల రవాణాకూ ఈ డ్రోన్ ను వాడొచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు. రోడ్డుతో పోల్చితే వాయు మార్గంలో ప్రయాణ దూరం మూడు రెట్లు తక్కువ. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే.. డ్రోన్ ద్వారా 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్ ను ఎయిర్ ట్యాక్సీగానూ ఉపయోగించవచ్చని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ సహవ్యవస్థాపకుడు మృదుల్ బబ్బర్ తెలిపారు.





