
* క్విట్ ఇండియా ఉద్యమానికి 80 ఏళ్లయిన సందర్భంగా నోయిడాలో ఏర్పాటు
జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటం తో పాటు స్వచ్ఛతపైనా ఎలుగెత్తారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తోంది ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా నగరపాలక సంస్థ. క్విట్ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల మార్చింగ్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రూపొందించారు. హెచ్ సీఎల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నోయిడా అడ్మినిస్ట్రేషన్ సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఈ విగ్రహాన్ని తయారు చేసింది. ఈ విగ్రహాన్ని 137వ సెక్టార్ లో ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు గుర్తు చేసేలా మహాత్ముడి విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు .
ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై జులై 1వ తేదీ నుంచి నిషేధం విధించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు, రాజస్థాన్‌లో ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొస్తే లీటర్ పెట్రోల్ పై డిస్కౌంట్ ఇస్తున్నారు ఓ పెట్రోల్ పంపు యజమాని అశోక్ కుమార్ ముంద్ర. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ఇష్టారీతిలో ఎక్కడపడితే అక్కడ పడేయకుండా అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు ఆయన చెప్పారు .





