-
డోపింగ్ టెస్టులో నమ్మలేని నిజాలు వెల్లడి
ఫరీద్‌కోట్: పంజాబ్‌లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా జైళ్ళకు సరఫరా అవుతున్నాయి. ఫరీద్‌కోట్ జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్ టెస్ట్లు నిర్వహించగా ఏకంగా 1,064 మంది డ్రగ్స్ వాడుతున్నట్టు తేలింది. పంజాబ్ జైళ్ళలో ఖైదీలకు మాదక ద్రవ్యాల సరఫరా నిరాటంకంగా సాగుతోందని చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో డోప్ టెస్ట్లు నిర్వహించాలని పంజాబ్ సర్కార్ ఆదేశించింది.
గతవారం డోప్ టెస్ట్లు చేశారు. ఆ ఫలితాల్లో 2,333 మంది ఖైదీల్లో 1,064 మంది డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఫరీద్‌కోట్ జైలులో 155 మంది మహిళా ఖైదీలు ఉండగా.. వారిలోనూ కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు పరీక్షల్లో వెల్లడైంది.
ఖైదీల్లో డ్రగ్స్ వినియోగం మాన్పించేందుకు పంజాబ్ సర్కార్ ఎప్పటి నుంచో జైళ్ళలో ఒక కేంద్రం ఏర్పాటు చేసింది. ఇంతమంది ఖైదీలు.. మాదక ద్రవ్యాలు వాడుతున్నప్పుడు ఆ కేంద్రం ఉపయోగమేమిటనే విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. తాజా పరీక్షల్లో దొరికినవారిని కూడా డ్రగ్స్ మాన్పించే కేంద్రంలో చికిత్స అందిస్తామని సివిల్ సర్జన్ డాక్టర్ సంజయ్ కపూర్ వెల్లడించారు.