News

‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’

427views

న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ‘వర్షాలు పడే సమయంలో మీరు గొడుగు కొంటారు కదా’.. అదేవిధంగా కరెన్సీ ఊగిసలాటలను అదుపులో ఉంచడానికి, విదేశీ మారక నిల్వలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఇతర వర్థమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే ఉందని దాస్‌ వివరించారు.

‘రూపాయి భారీ ఊగిసలాటను ఆర్‌బీఐ చూస్తూ ఊరుకోదు. ఆర్‌బీఐ చర్యల వల్లే రూపాయి చలనాలు స్థిరంగా ఉన్నాయ’న్నారు. అయితే, రూపాయి విలువ ఇంతమేర ఉంచాలనే లక్ష్యాన్ని ఆర్‌బీఐ విధించుకోలేదని స్పష్టం చేశారు. సరైన విదేశీ ద్రవ్యలభ్యత ఉండడం కోసం మార్కెట్‌కు అమెరికా డాలర్లను ఆర్‌బీఐ సరఫరా చేస్తోందన్నారు. ‘అసలు మనం నిల్వలను పోగు చేసేదే ఇటువంటి అవసరాల కోసం కదా’ అని పేర్కొన్నారు. ‘2016 నుంచి ద్రవ్యోల్బణ లక్ష్యం ఆధారిత ప్రణాళికను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల రీత్యా దానిని కొనసాగిస్తామ’ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి