News

శ్రీలంకను చూసైనా జాగ్రత్త పడండి… ఏపీ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

465views

న్యూఢిల్లీ: ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. శ్రీలంకలోని స్థితిగతులను చెప్పడానికి విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాల స్థితిగతులనూ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని వివ‌రించారు.

ఆంధ్రప్రదేశ్‌ రుణాలు జీఎస్‌డీపీలో 32%కి చేరినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటినట్టు పేర్కొన్నారు. ‘2019-2022 మధ్యకాలంలో ఏపీ బడ్జెటేతర మార్గాల నుంచి రూ.28,837 కోట్ల రుణం తీసుకుంది.

విద్యుత్తు సంస్థలకు రూ.10,109 కోట్ల బకాయిలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.34,208 కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది’ అని వివరించారు. తెలంగాణ రుణాలు జీఎస్‌డీపీలో 25%కి చేరాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి, వృద్ధి రేటు, అప్పుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? బడ్జెటేతర రుణాలు ఎంత మేరకు తీసుకున్నాయి? ఆస్తుల తాకట్టు, డిస్కంలు, జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రాలు ఇచ్చిన గ్యారెంటీల గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించి అప్రమత్తం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి