NewsProgramms

నిరుపేద విద్యార్థుల ప్రయోజనాలకే ఈ ‘నచికేత’

304views

* పేద విద్యార్థుల వసతిగృహం ప్రారంభోత్సవంలో ఆర్ ఎస్ ఎస్ సేవా ప్రముఖ్ శ్రీ కేశవయ్య

సేవా భారతి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా నిజమైన పేదలకు లబ్ది చేకూరాలని ఆర్ ఎస్ఎ స్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ యు. కేశవయ్య పేర్కొన్నారు. సేవా భారతి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని జేఎన్ టీయూ ఎదురుగా ఉన్న వినాయకుడి గుడి పక్క వీధిలో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన ఆవాస (హాస్టల్) భవనం ‘నచికేత’ ను ఆయన ప్రారంభించారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రేరణతో సేవాభారతి – కాకినాడ గత 25 సంవత్సరాలుగా సమాజంలోని కులమతాలకు అతీతంగా అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వారికి అనేక విధాలుగా సేవ చేస్తూ చేయూతనిస్తోంది. మహిళలకు కుట్టు శిక్షణ, విద్యార్థులకు సంస్కారాలనందించే ఏకోపాధ్యాయ పాఠశాలలు, వృద్ధులకు కంటి ఆపరేషన్లు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి క్లిష్ట సమయాలలో పేదలకు నిత్యావసర వస్తువులు, వంటసామగ్రి, బట్టలు, ఉచిత వైద్య సహాయాలను అందిస్తూ ఉంటుంది.

సేవాభారతి – కాకినాడ రజతోత్సవాల సందర్భంగా పేద విద్యార్థులకు సహాయకారిగా ఉండేలా ‘నచికేత’ ఉచిత వసతి గృహాన్ని కాకినాడలో నిర్మించాలని సేవాభారతి సంకల్పించింది.

ఆ మేరకు పూర్తయిన నచికేత భవనాన్ని జూన్ 19న ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సేవాప్రముఖ్ శ్రీ కేశవయ్య ప్రారంభించారు. ‘నచికేత’ భవనం ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అమ్మఒడి కాగలదని పలువురు కార్యకర్తలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.