
జర్మనీ: అప్పులిచ్చి చిన్న దేశాలను గుప్పిట పడుతున్న చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్‌లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు పాలుపంచుకుంటున్నారు.
చైనా ప్రభావాన్ని అడ్డుకొనేందుకు ఉద్దేశించిన గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 7 దేశాలు కలిసి 2027 నాటికి 600 బిలియన్ డాలర్లు (రూ.46.95 లక్షల కోట్లు) సమీకరిస్తాయి. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ నిధులను ఖర్చు చేస్తాయి. చైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట చిన్నదేశాలకు అప్పులిచ్చి, లాభపడుతున్న సంగతి తెలిసిందే. చైనాకు కౌంటర్‌గానే 600 బిలియన్ డాలర్ల నిధిని జి–7 దేశాలు తెరపైకి తీసుకొచ్చాయి.





