
చెన్నై: చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ శివాలయంలో జూన్ 17న అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీ పగల గొట్టి నగదు అంతా దోచుకుపోయాడు. ఈ చోరీపై ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తరువాత హుండీలో నగదు లెక్కించే కార్యక్రమం చేపట్టారు ఆలయ నిర్వాహకులు. హుండీ తెరవగా అందులో ఓ లేఖ ఉంది. దాన్ని ఎవరైనా భక్తులు వేశారేమో అనుకున్నారు మొదట.
కానీ లెటర్ చదివాక తెలిసింది అసలు విషయం. ఆ లెటర్ ఆ గుడిలో చోరీకి పాల్పడిన దొంగ రాసిన లేఖగా గుర్తించారు అధికారులు. ఆ లేఖలో “నన్ను క్షమించండి. నేను చిత్ర పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హుండి పగలగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత లేకుండాపోయింది. నా కుటుంబంలోనూ గతంలో ఎన్నడూ లేని సమస్యలన్ని వచ్చిపడ్డాయి. నేను హుండీలో చోరీ చేసిన రూ .10 వేల నగదును మళ్ళీ వేస్తున్నాను. నన్ను క్షమించండి. దేవుడు కూడా క్షమిస్తాడు అని ఆశిస్తున్నాను. అని రాసిన లేఖతో పాటు 500 నోట్లతో కూడిన రూ. 10 వేలు జతచేసి ఉంది.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది.





