
ముంబై: తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండేకు శివసేనతో మెజారిటీ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు స్పష్టం కావడంతో మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి సంకీర్ణం గురువారం పతనం అంచుకు చేరుకొంది.
కూటమి ప్రభుత్వంను కాపాడుకోవడం కోసం చివరి ఎత్తుగడగా తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపినా, సైద్ధాంతికంగా ఈ కూటమిని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంటూ షిండే తన విముఖతను స్పష్టం చేశారు.
బలపరీక్ష ద్వారానే ఉద్దవ్ ప్రభుత్వ భవిష్యత్తు తేలుతుందని అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో ప్రయత్నంకు సంకేతం ఇచ్చారు. బుధవారం రాత్రి వరకు మొత్తం 32 మంది సేన ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అస్సాంలోని గౌహతిలోని షిండే శిబిరంలో ఉండగా, గురువారం మరో ఐదుగురు చేరడంతో వారి సంఖ్య 37కు చేరుకొంది. పార్టీలో చీలిక గ్రూప్ ను ఏర్పాటు చేసి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నివారించడానికి షిండేకు 55 మంది సేన ఎమ్మెల్యేలలో 37 మంది మద్దతు అవసరం.
వారు కాక మరో ఐదుగురు స్వతంత్రులు కూడా ఉన్నారు. అయితే, తాజాగా తనకు 50 మంది మద్దతు ఉన్నట్లు షిండే ప్రకటించారు. వారిలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలే. మరింతమంది వచ్చి తమతో చేరుతున్నట్టు చెప్పారు.
Source: Nijamtoday





