News

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!

280views

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీఆర్‌పీఎఫ్‌ శిబిరానికి వెళ్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని తెలిపారు.

జవాన్లు తేరుకొని ఎదురుదాడికి దిగినప్పటికీ ముగ్గురు నేలకొరిగారని వెల్లడించారు. ఈ ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన శిశుపాల్‌ సింగ్‌, హరియాణాకు చెందిన శివలాల్‌ సింగ్‌, బిహార్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోయారని వివరించారు. గాయపడిన మరి కొంతమంది జవాన్లు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక శిబిరాన్ని మావోయిస్టులు కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారని, వారి హెచ్చరికలు బేఖాతరు చేశామన్న ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారని, కూంబింగ్‌ కొనసాగుతుంద‌ని డీఐజీ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి