
-
ఆఫ్ఘన్‌లో సిక్కులకు రక్షణ కరవైందని సిక్ సమాజం ఆందోళన
కాబూల్: అఫ్ఘనిస్థాన్ కాబుల్‌లోని గురుద్వారా కర్తా పర్వ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. గురుద్వారా గేటు బయట దాడులు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పేలుళ్ళతో పక్కనే ఉన్న షాపులు కూడా దగ్ధమయ్యాయని చెబుతున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరు అఫ్ఘన్లు చనిపోయినట్టు పేర్కొన్నారు.
మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే, భారతీయ సిక్కు నేత మన్జిందర్ సిర్సా కూడా ట్వీట్ చేశారు. బుల్లెట్ గాయాలతో చనిపోయిన ఓ వ్యక్తి ముస్లిం అని పేర్కొన్నారు. లోపల ఇంకా కొందరు చిక్కుకున్నట్టు వెల్లడించారు. సంబంధిత వీడియోలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓ ఉగ్ర ముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు దాడికి పాల్పడినట్టు ఆయన ఆరోపించారు. అఫ్ఘన్‌లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పవిత్ర గురుద్వారాపై దాడి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో.. భారత విదేశీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఉగ్రదాడి పట్ల ఆందోళన చెందుతున్నామని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేసింది.





