News

తమిళనాడులో వెల్లివిరిసిన మతసామరస్యం… అమ్మవారి మహాకుంభాభిషేకంలో ముస్లింలు

470views

తిరువారూరు: తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఆ మేరకు పండుతక్కడి గ్రామస్తులు, అక్కరై పుదువీది వాసులు, ముస్లింలు, భక్తులంతా కలిసి ఈ వేడుకలను ఘనంగా జరిపారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల మండపంలో ప్రత్యేక వేదికపై పవిత్ర నదీజలాలున్న కలశాలను ప్రత్యేక వేదికపై ఉంచి విఘ్నేశ్వర పూజ సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగపూజ గోపూజ, సరస్వతిపూజతో పూర్ణాహుతి జరిపారు. ఆ తర్వాత తిరువాడుదురై కీర్తివాసన్‌ గురుక్కల్‌ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు కే బాలకృష్ణన్‌, మరో పదిమంది వేదపండితులు యాగశాలలోని పవిత్రజలాలున్న కలశాలలను గ్రామస్తులు, ముస్లిం మతపెద్దల సమక్షంలో ఊరేగింపుగా ఆలయ రాజగోపురాలపైకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత గోపురకలశాలను పవిత్ర జలాలతో అభిషేకించారు. ఈ వేడుకల్లో నగరపంచాయతీ సభ్యుడు ఆర్‌ మహమ్మద్‌ కాదర్‌ మైదీన్‌, నగరపంచాయతీ మాజీ సభ్యుడు మీరామైదీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రామంలోని హిందువులు, ముస్లింలు కలిసి ఈ కుంభాభిషేకవేడుకల్లో పాల్గొని మతసామరస్యాన్ని చాటడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి