News

వారణాసి బాంబు పేలుళ్ళ దోషి… ఉగ్రవాది వలియుల్లా ఖాన్!

497views

వారణాసి: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాల నగరం వారణాసిలో పదహారేళ్ళ క్రితం జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఉగ్రవాది వలియుల్లా ఖాన్ దోషి అని ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. ఖాన్‌కు శిక్షను ఈ నెల ఆరోతేదీన‌ ఖరారు చేస్తామని తెలిపింది. 2006 మార్చి ఏడోతేదీన‌ వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం, కంటోన్‌మెంట్ రైల్వే స్టేషన్ల వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ‌లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా ఇచ్చిన తీర్పులో రెండు కేసుల్లో ఉగ్రవాది వలియుల్లా ఖాన్ దోషి అని తెలిపారు. హత్య, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం, ఆయుధాలను అక్రమంగా వినియోగించడం తదితర నేరారోపణలతో ఈ కేసులను పోలీసులు దాఖలు చేశారు.

ఆ రోజు ఏం జ‌రిగిందంటే…

2006 మార్చి ఏడోతేదీన‌ సాయంత్రం 6.15 గంటలకు సంకట్ మోచన్ దేవాలయంలో మొదటి పేలుడు సంభవించింది. 15 నిమిషాల తర్వాత వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లోని మొదటి తరగతి విశ్రాంతి గది వద్ద మరొక పేలుడు సంభవించింది. అదే రోజు దశాశ్వమేధ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద కుకర్ బాంబు పేలింది.

వారణాసిలోని న్యాయవాదులు ఈ కేసుల్లో వాదనలు వినిపించేందుకు నిరాకరించడంతో విచారణను ఘజియాబాద్ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. మొత్తం మూడు కేసుల్లో విచారణ జరిగింది. మొత్తం మీద 121 మంది సాక్షులను కోర్టు విచారించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి