News

ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధం

3views

బక్రీద్‌ పండుగ సందర్భంగా గోవులు, దూడలు, ఒంటెల వధపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోందని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్‌పిళ్లై స్పష్టం చేశారు. మదనపల్లెలోని స్థానిక పశుసంవర్థకశాఖ ఏడీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జంతు సంరక్షణ చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా గోవులు, ఒంటెల వధ పూర్తిగా నిషేధంలో ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వధించరాదని తెలిపారు.

అదేవిధంగా చూలు పశువులు, మూడు నెలల లోపు దూడలు, అలాగే ప్రభుత్వ పశువైద్యుల ధృవీకరణ లేని పశువులను వధించడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పశువుల వధకు ముందు సంబంధిత అధికారుల అనుమతులు, వైద్య ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. బక్రీద్‌ సందర్భంగా కొందరు నిబంధనలు ఉల్లంఘించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

జంతు హింస నివారణ చట్టం (PCA Act–1960) ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుణశేఖర్‌పిళ్లై హెచ్చరించారు. గోరక్షణ, జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. అక్రమ వధ, రవాణా లేదా అనుమతి లేని కార్యకలాపాలపై సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేశామని తెలిపారు.

బక్రీద్‌ పండుగను శాంతియుతంగా, చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.