
వర్షాధార వ్యవసాయానికి పీఎండీఎస్ (PMDS – Pre-Monsoon Dry Sowing) విధానం ఒక వరంలాంటిదని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో పీఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న పంటలను కలెక్టర్ డా. ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందస్తు వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పీఎండీఎస్ విధానం వర్షాధార ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం రైతు ఆంజనేయులు పొలాన్ని సందర్శించిన కలెక్టర్, పీఎండీఎస్ పద్ధతిలో సాగు చేస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలించారు.
ఈ విధానం ద్వారా తనకు కలిగిన లాభాలను ఇతర రైతులతో పంచుకుని, మరింత మంది రైతులు పీఎండీఎస్ పద్ధతిని అనుసరించేలా ప్రోత్సహించాలని రైతుకు సూచించారు. ఈ పద్ధతి ద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, రసాయన ఎరువుల అవసరం తగ్గడంతో భూమి సారవంతంగా మారుతుందని తెలిపారు.
జిల్లాలోని రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు పీఎండీఎస్ వంటి ఆధునిక ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందించుకుని, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అనంతరం రైతు రామేశ్వరమ్మ సాగు చేస్తున్న మల్లె పంటను పరిశీలించిన కలెక్టర్, జిల్లాలో మల్లె పంట విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో పీఎండీఎస్ వ్యవసాయ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ లక్ష ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించామని, పెండింగ్‌లో ఉన్న లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఈ విధానం ప్రయోజనాలు చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
తదుపరి రైతు మోహన్ పొలంలో కలెక్టర్ డా. ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత స్వయంగా పీఎండీఎస్ విత్తనాలను చల్లి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులను రైతులకు చేరవేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.




