
-
నేడు స్వామినారాయణ్ పుణ్యతిథి
న్యూఢిల్లీ: సృష్టిలోని సౌందర్యాన్నంతా ఉలులకు అద్ది శిల్పుల చేతికి అందిస్తే అది అక్షరధామ్ అవుతుంది. సనాతన భారతీయ కళలు, మనవారి అసమాన ప్రజ్ఞావిశేషాలు, ఆలోచనా విలువలకు నిలువుటద్దంలా అక్షరధామం కనువిందు చేస్తుంది. ఉద్ధవ సంప్రదాయ పరంపరలో ముఖ్యగురువు శ్రీస్వామి నారాయణ్ పేరిట అక్షరధామ్ రూపుదిద్దుకుంది. శ్రీస్వామి నారాయణ రెండు శతాబ్దాలకు పూర్వమే స్త్రీల సమానహక్కులకు పోరాడారు. సతీ సహగమనాన్ని తీవ్రంగా నిరసించారు.
ప్రాణం పోసినవారికి మాత్రమే ప్రాణం తీసుకునే హక్కు ఉంటుందని వాదించారు. యజ్ఞయాగాలలో స్త్రీకి సమాన ప్రాతినిధ్యం ఉండాలన్నారు. ఆత్మకు స్త్రీ పురుష భేదమేమిటని ప్రశ్నించారు. నిమ్న వర్గాలను చిన్న చూపు చూడడాన్ని నిరసించారు. సహపంక్తి భోజనాలు ప్రోత్సహించారు.
ఆలయాలలో ఆడ, మగ వివక్ష కూడదన్నారు. ఔషధ ప్రాయంగానైనా మద్యాన్ని సేవించ రాదు. జంతుబలులు అపచారం. తాంత్రిక కలాపాలు సమాజాన్ని తప్పుతోవ పట్టిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ మందిరాలకు అక్షరధామ్ అని పేరు. భారత రాజధాని న్యూఢిల్లీలోని 24వ జాతీయ రహదారిపై అక్షరధామ్ ప్రపంచ పర్యాటకులందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.





