News

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో మహిళా టీచర్ మృతి

286views

* మొన్న టీవీ నటి. ఇప్పుడు టీచర్

* ఉగ్రమూకల చేతిలో బలవుతోన్న సామాన్య పౌరులు

మ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ మహిళలు, సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. మంగళవారం కుల్గాంలోని గోపాల్‌రాలో ఉగ్రమూకలు ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాయి.

ఆ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతురాలు జమ్ము డివిజన్‌లోని సాంబా ప్రాంతానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఆమె పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని, గాలింపు చేపడుతున్నాయి. ఇటీవల కాలంలో ముష్కరుల చేతిలో సామాన్య ప్రజలు బలవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మే 12న బుద్గాం జిల్లాలో రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగి రాహుల్ భట్ బలయ్యారు. గతవారం టీవీ నటి అమ్రీన్ భట్ ఉగ్రమూకల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. చదూరలోని ఆమె నివాసంలో రాత్రి వేళ లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

పౌరులపై వరుసగా జరుగుతోన్న దాడులను జమ్మూకశ్మీర్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘ఇది చాలా బాధాకరం. నిరాయుధులైన సామాన్య ప్రజలపై వరుసగా జరుగుతోన్న లక్షిత దాడుల్లో ఇది మరొకటి’ అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు. ‘కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయనుకుంటూ ఉన్నా లక్షిత హత్యలు పెరుగుతున్నాయి’ అంటూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాన్యులను భయభ్రాంతులను చేసేందుకే…

కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు గైకొని ఉగ్రవాదుల అంతు చూస్తోంది. గత రెండున్నర సంవత్సరాల కాలగతిలో జమ్మూకాశ్మీర్లోని అనేక ఉగ్రవాద సంస్థలు సమూలంగా తుడిచిపెట్టుకుపోయాయి. 3 దశాబ్దాల క్రితం కాశ్మీర్ లోయలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల కారణంగా జమ్ము కాశ్మీర్ ని విడిచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన హిందువులకు తిరిగి అక్కడే పునరావాసం కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అంతేగాక గత రెండున్నర సంవత్సరాల కాలంలో అనేకమంది కాశ్మీరీ హిందువులకు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ఉగ్ర మూకలు మరళా సామాన్యులను బెదరగొట్టడం కోసం వారిపై దాడులకు తెగబడుతున్నాయి.

భద్రతా బలగాల కఠిన చర్యలు

అయితే భద్రతా బలగాలు సైతం సామాన్యులపై జరుగుతున్న ఇలాంటి దాడులను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. దాడులు జరిగిన గంటలు, రోజులు వ్యవధిలోనే అందుకు కారణమైన ఉగ్రవాదులని, వారి వెనకనున్న సంస్థల్ని గుర్తించి నిర్ధాక్షిణ్యంగా మట్టుబెడుతున్నాయి. గత వారం కానిస్టేబుల్ పై కాల్పులు జరిపి సంహరించిన ఉగ్రవాదులను భద్రతా దళాలు తెల్లారే కల్లా మట్టుబెట్టిన సంఘటన పాఠకులకు విదితమే. మొత్తానికి జమ్మూకాశ్మీర్లో తాజాగా సామాన్యులపై జరుగుతున్న ఈ దాడుల వెనుక వేర్పాటువాద రాజకీయ పార్టీల హస్తాన్ని కూడా కాదనలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.