News

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

315views

* పోలీసు హత్యకేసులో ప్రమేయమున్న ఉగ్రవాది హతం

శ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పుల్వామాలోని గుండిపొరా గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌(జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో.. మే 13న పుల్వామాలో పోలీసు కానిస్టేబుల్‌ రియాజ్ అహ్మద్‌ హత్య కేసులో ప్రమేయమున్న అబిద్ షా ఒకడని కశ్మీర్‌ ఐజీపీ తెలిపారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే రైఫిల్స్, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, సెర్చ్‌ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.

గుండిపొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారంటూ కుల్గాం పోలీసులు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతాబలగాలు, పోలీసులు ఆదివారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. చీకటి కారణంగా రాత్రి పూట ఆపరేషన్ నిలిపేసి, ఉదయం మళ్లీ ప్రారంభించారు. దాదాపు 13 గంటలపాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరిని అంతమొందించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది కశ్మీర్‌లో ఇప్పటివరకు 54 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. 26 మంది పాక్‌కు చెందిన ఉగ్రవాదులతో సహా 86 మందిని భద్రతా బలగాలు హతమార్చాయి. 44 మంది ముష్కరులను, 183 మంది సానుభూతిపరులను అరెస్టు చేశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.