News

బరితెగించిన తీవ్రవాదులు! కానిస్టేబుల్, ఆయన ఏడేళ్ళ‌ కుమార్తెపై కాల్పులు

227views

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో ఓ కానిస్టేబుల్​పై తూటాల వర్షం కురిపించారు. అతని ఏడేళ్ళ‌ కుమార్తెపైనా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా.. కానిస్టేబుల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కుడి చేతికి బుల్లెట్ గాయమైన అతని కుమార్తెకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

మృతి చెందిన కానిస్టేబుల్​ను సౌరాలోని మాలిక్ సాహిబ్ ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు చెప్పారు. కూతుర్ని ట్యూషన్​ నుంచి తీసుకెళ్లి ఇంటివద్ద డ్రాప్ చేస్తుండగా.. ఉగ్రవాదులు దాడి చేసినట్టు వివరించారు.

కానిస్టేబుల్​ కుమార్తె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఖాద్రి మృతితో కశ్మీర్​లో నెల వ్యవధిలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లయింది. వీరంతా ఉగ్రవాదుల దాడిలోనే మరణించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి