
* దంపతుల ఆచూకీ తెలుసుకోవడానికి స్నేహితుల సాయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన హంతకుడు మొబిద్ అహ్మద్
* ఇద్దరు బిడ్డల తండ్రితో చెల్లెలికి వివాహం చెయ్యడానికి సిద్ధపడ్డ నిందితుడు
* దంపతుల ఆచూకీ చెప్పడంలో బాధితురాలి అక్క, బావల తోడ్పాటు
సరూర్‌నగర్ పరువుహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చెల్లెలు ఆశ్రిన్ సుల్తానా ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కసితో రగిలిపోయిన సోదరుడు మోబిన్ అహ్మద్.. పథకం ప్రకారమే నాగరాజును హత్య చేసినట్టు నిర్ధారించిన పోలీసులు మే 6న సయ్యద్ మోబిన్ అహ్మద్, మహ్మద్ మసూద్ అహ్మద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసు రిమాండ్ రిపోర్ట్‌లో హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పథక రచన వివరాలను పేర్కొన్నట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా మర్పల్లి కి చెందిన నాగరాజు (25), ఆశ్రిన్ సుల్తానా (25) పాఠశాల వయసు నుంచి ప్రేమించుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 1న పాతబస్తీలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. మే 4న రాత్రి 7 గంటల సమయంలో సరూర్‌నగర్ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న నాగరాజు దంపతులను అడ్డగించి నాగరాజును హతమార్చారు.
అసలేం జరిగిందంటే….
హత్య కేసులో ప్రధాన నిందితుడు మోబిన్ అహ్మద్ ఇంటికి పెద్దకుమారుడు. తండ్రి మూత్రపిండాల వ్యాధికి గురవటంతో డయాలసిస్ చేయించేందుకు అనువుగా ఉంటుందని ఐడీపీఎల్ కాలనీ గురుమూర్తినగర్ చేరారు. రెండేళ్ల క్రితం తండ్రి మరణించటంతో కుటుంబ భారం మోబిన్ అహ్మద్‌పై పడింది. తల్లి, ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడ్ని పోషించేందుకు పండ్లు విక్రయించేవాడు. గతేడాది రెండో సోదరిని లింగంపల్లికి చెందిన మసూద్ అహ్మద్ కిచ్చి వివాహం చేశాడు. మూడోసోదరి ఆశ్రిన్ సుల్తానాకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో భార్య మరణించి ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యాడు. సోదరి ఎదురు తిరగటం, కొట్టినా దారికి రాకపోవటంతో గొడవలు పెరిగాయి. అక్కడే ఉంటే పెళ్లి చేస్తారని భయపడిన ఆశ్రిన్ సుల్తానా జనవరి 30న ఇల్లు వదలి నాగరాజు వద్దకు చేరింది. ఫిబ్రవరి 1న ఇద్దరూ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు. బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం నాగరాజు, అశ్రిన్ వికారాబాద్ జిల్లా ఎస్పీని ఆశ్రయించి రక్షణ కల్పించమని కోరారు. రెండుసార్లు నాగరాజు మోబిన్ అహ్మద్‌తో మాట్లాడాడు. మతం మారేందుకు తాను సిద్ధమేనంటూ చెప్పాడు.
ఆశ్రిన్ ఆచూకీ చెప్పిన అక్క
పెళ్లి తరువాత ఆశ్రిన్ సుల్తానా లింగంపల్లిలో ఉన్న అక్క, పిన్నితో ఫోన్‌లో మాట్లాడేది. ఆశ్రిన్ అక్క భర్త మసూద్ అహ్మద్ ద్వారా మోబిన్ అహ్మద్‌కు దంపతుల ఆచూకీ తెలిసింది. ఆశ్రిన్, నాగరాజు ఫోన్‌నంబర్లను సేకరించిన మోబిన్ స్నేహితుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నాగరాజు మొబైల్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేయించాడు. లోకేట్ యాప్ ద్వారా ఏ సమయంలో ఎక్కడున్నారనే సమాచారం సేకరిస్తూ వచ్చాడు. మార్చిలోనే హత్యకు పథకం వేసినా రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో వాయిదా వేశాడు. రంజాన్ మరుసటిరోజు బుధవారం ఘాతుకానికి తెగబడ్డాడు.





