News

మోదీపై.. 108 మంది మాజీ బ్యూరోక్రాట్ల లేఖ ఓ కుట్ర!

457views

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్నారంటూ కాన్ స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ (సీసీజీ) పేరుతో 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు రాసిన బహిరంగ లేఖ కుట్రపూరితమైనదని పేర్కొంటూ మరో గ్రూప్ లేఖ రాసింది.

మోదీకి మద్దతుగా ‘కన్సర్న్ డ్ సిటిజన్స్’ పేరుతో రాసిన ఈ లేఖపై ఎనిమిది మంది మాజీ జడ్జీలు, 97 మంది బ్యూరోక్రాట్లు, 92 మంది మాజీ ఆర్మీ అధికారులు సంతకాలు చేశారు. దేశంలో మోదీకి లభిస్తున్న మద్దతు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో సీజీజీ పూర్తి నిరాశలో మునిగిపోయి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఆ లేఖ రాసినట్టుగా ఉందని ఆరోపించింది.

వాళ్ళ‌ కోపం, వేదన కేవలం ఒక వ్యక్తి మీదే కాదు, వాస్తవానికి వాళ్ళే విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని అంటూ ఎదురు దాడి చేసింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని తప్పుడు ధోరణిలో చిత్రీకరిస్తూ పూర్తిగా పక్షపాతంగా సీసీజీ లేఖ ఉందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై స్పందించలేదేమని వారు ప్రశ్నించారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని వారు మండిప‌డ్డారు. హిజాబ్, హలాల్ మీద ఉన్న ఆసక్తి ఇతర అంశాల మీద లేదెందుకని వారు నిలదీశారు.

లేఖలో వాళ్ళు వాడిన పదజాలం చూస్తే పాశ్చాత్య మీడియా ఛాయలు కనిపిస్తున్నాయని, అంతర్జాతీయ లాబీల ప్రోత్సాహంతోనే లేఖ రాసినట్టుగా ఉందని వారు ఆరోపించారు. విదేశీయుల కుట్రలో ఈ లేఖ ఒక భాగమని కన్సర్న్ డ్ సిటిజన్స్ స్పష్టం చేశారు.

పైగా, బీజేపీ ప్రభుత్వ హయాంలో మతపరమైన హింసాత్మక సంఘటనలు “స్పష్టంగా” తగ్గాయని, ఈ విషయమై ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారని వారు పేర్కొన్నారు. అక్కడక్కడా అప్పుడప్పుడు చెలరేగే మతపరమైన హింసను విపరీతంగా చూపిస్తూ ఇటువంటి సమూహాలను ప్రేరేపిస్తున్నారని వారు దుయ్యబట్టారు.

“రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లేదా న్యూఢిల్లీలో హిందువుల పండుగల సమయంలో శాంతియుత ఊరేగింపులపై ముందస్తుగా జరిపిన దాడులను” కప్పిపుచ్చే విధంగా వేరే కథ‌నాలు సృష్టించడమే వీరి అసలు ఉద్దేశ్యం అంటూ ఆరోపించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి