
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో నక్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన విజ్ఞప్తిని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు.
భారత్-బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ చర్చల అనంతరం శృంగ్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్ళను తిరిగి తమకు అప్పటించాలని కోరామని, ఈ విషయాన్ని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు.
ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని తాము బ్రిటన్‌లో వివిధ స్థాయుల్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. మన దేశంలో చట్టపరమైన చర్యలను, విచారణను ఎదుర్కొనవలసి ఉన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
కాగా, భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి బోరిస్ జూన్సన్ ప్రధాని మోదీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని తెలిపారు.
వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందని చెబుతూ భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు.
Source: Nijamtoday





