News

ఆర్‌.ఎస్‌.ఎస్‌కు పరువు నష్టం అనే హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉంది: సుప్రీం కోర్టు

291views

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు పరువు నష్టం జరిగిందని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేసే అధికారం, హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని చెప్పిన కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది. మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ దాఖలు చేసిన అప్పీలును తోసిపుచ్చింది.

మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురించిన వ్యాసం ఆర్‌.ఎస్‌.ఎస్ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తోందని ఆర్‌.ఎస్‌.ఎస్ కేరళ రాష్ట్ర శాఖ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ, 153ఏ, 500తోపాటు సెక్షన్ 34 ప్రకారం శిక్షించదగిన నేరాలకు ఈ వీక్లీ పత్రిక పాల్పడిందని ఆరోపించారు.

దీనిపై ఎర్నాకుళం కోర్టు విచారణ జరుపుతోంది. ఈ విచారణకు సంబంధించిన అన్ని వ్యవహారాలను రద్దు చేయాలని మాతృభూమి వీక్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అందుకు వ్యతిరేకించడంతో సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులో, ఏదైనా సంఘానికి నిర్ణీత పరిధి, గుర్తించగదిన వ్యవస్థ ఉన్నట్ట‌యితే, ఆ సంఘానికి వ్యతిరేకంగా ఉపయోగించిన పరువు నష్టం కలిగించే మాటలను, ఆ సంఘంలోని వ్యక్తులకు జరిగిన పరువు నష్టంగా పరిగణించవచ్చునని తెలిపింది.

అటువంటి సంఘ సభ్యుడు ఎవరైనా ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ చేసిన అప్పీలును విచారించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ అప్పీలును తోసిపుచ్చుతున్నట్టు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం మార్చి 25న తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి