News

పాకిస్థాన్‌ యువతికి భారతీయుడి గుండె

267views

అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్‌ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్‌(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్‌ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షించిన వైద్య నిపుణుడు డాక్టర్‌ కేఆర్‌ బాలకృష్ణన్‌.. ఆమె గుండెకు పంప్‌ అమర్చి ప్రాణాలు కాపాడారు.

అనంతరం స్వదేశానికి వెళ్లిన ఆయిషా పాఠశాల విద్య కొనసాగించారు. గత ఏడాది మళ్లీ అనారోగ్యానికి గురవడంతో తిరిగి తమిళనాడు ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న డాక్టర్‌ బాలకృష్ణన్‌ వద్దకు ఆయిషాను కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తేనే ప్రాణాలు కాపాడగలమని ఆయన స్పష్టం చేయడంతో దాత కోసం ఎదురుచూస్తూ బాధితురాలు 18 నెలలుగా ఇక్కడే ఉండిపోయారు. ఆఖరికి జనవరి 31న దిల్లీ నుంచి బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి గుండె ఆయిషాకు లభించింది. శస్త్రచికిత్సకు రూ.35 లక్షలు ఖర్చవుతుందనటంతో కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. తమిళనాడులోని ఐశ్వర్యా ట్రస్టు ద్వారా సహాయం అందటంతో ఎంజీఎం ఆసుపత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయిషా త్వరలో స్వదేశానికి వెళ్లిపోనున్నారు.

ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. పాక్‌తో పోల్చితే ఇక్కడ వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స సౌకర్యం లేదని తమ వైద్యులు చెప్పడంతో బాలకృష్ణన్‌ను సంప్రదించామని తెలిపారు. భారతదేశానికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. కరాచీ వెళ్లి మళ్లీ విద్య కొనసాగిస్తానని, ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలన్నదే తన లక్ష్యమని ఆయిషా వెల్లడించారు.