
* మరో 18 దేశాలకు చెందిన147 మందిని కూడా భారత్ కు తీసుకొచ్చినట్టు వెల్లడించిన విదేశాంగ మంత్రి
యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినా అక్కడి భారతీయులను సురక్షితంగా స్వదేశం తీసుకురాగలిగామని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారత్ కు మొత్తం 22,500 మందిని భారత్ కు సురక్షితంగా, విజయవంతంగా తరలించగలిగామని మంత్రి వెల్లడించారు. తరలింపు ప్రక్రియపై రాజ్యసభలో ప్రకటన చేసిన ఆయన అనేక సవాళ్ల మధ్య దాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని గుర్తించి జనవరిలోనే తరలింపునకు రిజిస్ట్రేషన్ ను ప్రారంభించినట్లు వివరించారు. ఈ ప్రక్రియకు పౌర విమానయాన శాఖ సహా అన్ని విభాగాలూ చక్కగా సహకరించాయని ఆయన తెలిపారు. భారతీయుల తరలింపు ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్షించారని మంత్రి వివరించారు.
భారతీయులను మాత్రమే కాకుండా భారత్ నమ్మే వసుదైక కుటుంబమనే భావనలో భాగంగా సుమారు 18 దేశాలకు చెందిన 147 మందిని కూడా భారత్ కు సురక్షితంగా తరలించామని జైశంకర్ పేర్కొన్నారు.





