
తెలంగాణలోని యాదాద్రి క్షేత్రంలో పునర్నిర్మిత పంచ నారసింహుల దివ్యాలయ ఉద్ఘాటన పర్వానికి ఆలయ నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి వారం పాటు కొండపై ఉన్న బాలాలయంలో పంచ కుండాత్మక హోమం జరుగుతుందని ఆలయ ఈవో గీత మంగళవారం తెలిపారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ తోపాటు కలశాల సంప్రోక్షణను కూడా నిర్వహిస్తామన్నారు. తర్వాత భక్తులను స్వయంభువుల దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.
గతంలో తెలిపిన ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుందని ఈవో అన్నారు. ఈ నెల 21 నుంచి మొదలయ్యే హోమాది పూజల పూర్తి వివరాలను రెండ్రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఆర్జిత సేవలలో భాగంగా బాలాలయంలో కొనసాగుతున్న స్వామి నిత్యకల్యాణోత్సవాలను పాతగుట్ట అనుబంధ ఆలయానికి తరలించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఇంకా రెండ్రోజులు (బుధ, గురు) మాత్రమే బాలాలయంలో నిత్యకల్యాణాలు జరుగుతాయని, ఈ నెల 18(శుక్రవారం) నుంచి పాతగుట్టలో శ్రీస్వామి, అమ్మవారల కల్యాణ మొక్కులను తీర్చుకోవచ్చని ఈ సందర్భంగా ఈవో వెల్లడించారు.



