
-
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం పూర్వం ఉన్నట్టు ఏ విధంగా ఆధారాలతో నిరూపించారో, అదే విధంగా సరస్వతి నది గతంలో మనుగడలో ఉండేదన్న వాస్తవాన్ని ఆధారాలతో నిరూపించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు.
ఢిల్లీలో ‘ద్విరూప సరస్వతి’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ నేటితరం ఆధారాలు ఉంటేగాని మన ప్రాచీన వారసత్వానికి సంబంధించిన ఏ విషయాన్నీ నమ్మలేరని, లేని పక్షంలో కల్పిత గాథలు అనుకుంటున్నారని స్పష్టం చేశారు. రామసేతు వంటి అంశాలపై కూడా ఆధారాలు ప్రజల ముందుంచడం చాలా అవసరమని చెప్పారు.
నేటి విద్యావిధానం విశ్వాసాలను ప్రోత్సహించదని చెబుతూ తగు ఆధారాలతో సరస్వతి నది గురించి పాఠ్యగ్రంథాలలో ఉంచాలని భాగవత్ సూచించారు. దేశ ప్రాచీన గొప్పతనాన్ని విద్యావంతులు వెలికి తీసి, పుస్తక రూపం ఇవ్వాలని, అలా దేశ చరిత్రలో మరుగున పడిన అనేక అంశాలను విశ్వసనీయతతో ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
“దేశాన్ని ప్రపంచం ముందు విశ్వగురువుగా నిల్చోబెట్టాలి… అంతేకాదు.. భారతదేశ కీర్తిప్రతిష్ఠలు లోకానికి తెలియాలంటే, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కొనసాగిన విధానాల్ని, సత్యాల్ని ప్రజలకు తెలియజేయాలి… ఇందుకు విద్యావంతులు పూనుకుంటే మన దేశ ప్రాచీనత గురించి ప్రజల్లో మరింత అవగాహన, నమ్మకాన్ని కల్పించగలం. ప్రతిదాన్ని ఆధారాలతో సహా పుస్తకాలు ముద్రించాలి” అని స్పష్టం చేశారు.
సరస్వతి నదికి మన చరిత్రతో చాలా సంబంధం ఉన్నదని చెబుతూ… అయితే బ్రిటిష్ వారు మనకంటూ గర్వించదగిన వారసత్వం గాని, సంపద గాని లేదని, అంతా మిగిలిన ప్రపంచం నుండే తెచ్చుకున్నామనే అబద్దాలను ప్రచారం చేశారని డాక్టర్ భగవత్ పేర్కొన్నారు.
ఒకప్పుడు సరస్వతి నది నెలకొన్న ప్రాంతంలో భూమి క్రింద నీటి వనరులు ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్నాయని మోహన్‌జీ చెప్పారు. అందుకనే సరస్వతి నది ఎక్కడ నుండి ఎక్కడికి ప్రవహించిందో అనే వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం తాము చేయవలసిన కృషి చేస్తున్నదని, కానీ ప్రజలు సైతం తమ వంతు కృషి చేయాలని సూచించారు.
మనం రామసేతు గురించి చెప్పిన్నప్పుడు అందరు కల్పిత కథలుగా భావించేవారని, కానీ క్రమంగా ఆధారాలు బయట పడుతూ ఉండడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని డాక్టర్ భగవత్ గుర్తు చేశారు.
మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మురళి మనోహర్ జోషి మాట్లాడుతూ ఒక వర్గం ఏ విధంగా మన ప్రాచీన చరిత్రను ప్రశ్నిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేధావులు అనుకొంటున్న కొందరు మన చరిత్రకు, వారసత్వానికి చెదలు పట్టించే ప్రయత్నం చేయడంతో నన్ను పార్లమెంట్ లో సంస్కృత భాష బోధన ప్రోత్సహిస్తున్నానని విమర్శలు గుప్పించారని ఆయన గుర్తు చేశారు.
Source: Nijamtoday




