
దేశ వ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
ఇవి 2020 ఫిబ్రవరి (రూ.1,05,366 కోట్ల)తో పోలిస్తే 26%, 2021 ఫిబ్రవరి (రూ.1,13,143 కోట్ల)తో పోలిస్తే 18% అధికం. ఈ ఏడాది జనవరి వసూళ్లయిన రూ.1,40,986 కోట్లతో పోలిస్తే 5.64% తగ్గాయి. ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి జనవరి కంటే ఆదాయం తగ్గినట్లు విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించడం ఇది తొమ్మిదోసారి కాగా, రూ.1.30 లక్షల కోట్లను మించడం 5వ సారి. సెస్ విక్రయాలు రూ.10,000 కోట్లను మించడం చూస్తే, వాహనాల అమ్మకాలతో పాటు మరిన్ని రంగాల్లో రికవరీకి నిదర్శనమని పేర్కొంది.
* ఫిబ్రవరి వసూళ్లలో సీజీఎస్‌టీ వాటా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ వాటా రూ.30,779 కోట్లు, ఐజీఎస్‌టీ వాటా రూ.67,471 కోట్లు (దిగుమతులపై లభించిన రూ.33,837 కోట్లు సహా), సెస్ రూ.10,340 కోట్లు (దిగుమతులపై లభించిన రూ.638 కోట్లు కలిపి) ఉంది. సర్దుబాట్ల తర్వాత ఫిబ్రవరి ఆదాయంలో కేంద్ర జీఎస్‌టీకి రూ.50,782 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీకి రూ.52,688 కోట్లు చేరింది.
* ఏడాది క్రితంతో పోలిస్తే, వస్తువుల దిగుమతిపై 38%, దేశీయ కార్యకలాపాలపై 12 శాతం అధిక ఆదాయం వచ్చినట్లు ఆర్థికశాఖ తెలిపింది.
* కరోనా కారణంగా పాక్షిక లాక్‌డౌన్‌లు, వారంతపు, రాత్రి కర్ఫ్యూలు, విభిన్న ఆంక్షలు ఉన్నప్పటికీ పన్ను ఆదాయంలో సానుకూల పెరుగుదల కనిపించినట్లు తెలిపింది.
ఏపీలో 19%, తెలంగాణలో 13% వృద్ధి
ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 19%, తెలంగాణలో 13% వృద్ధి నమోదైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. 2021 ఫిబ్రవరిలో ఏపీకి రూ.2,653 కోట్ల ఆదాయం రాగా ఈసారి రూ.3,157 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం రూ.3,636 కోట్ల నుంచి రూ.4,113 కోట్లకు చేరింది. జాతీయస్థాయిలో రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం ఈనెలలో సగటున 12% పెరగ్గా, తెలుగురాష్ట్రాలు రెండూ అంతకంటే ఎక్కువే సాధించాయి. ఈనెల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక (21%) తర్వాతి స్థానాల్లో ఏపీ (19%), కేరళ (15%), తెలంగాణ (13%), పుదుచ్చేరి (13%)తమిళనాడు (5%) నిలిచాయి. నికర ఆదాయపరంగా కర్ణాటక (రూ.9,176 కోట్లు), తమిళనాడు (రూ.7,393 కోట్లు), తెలంగాణ (రూ.4,113 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.3,157కోట్లు), కేరళ (రూ.2,074 కోట్లు), పుదుచ్చేరి (రూ.178 కోట్లు) వరుసక్రమంలో నిలబడ్డాయి. దేశంలో నెలవారీ వసూళ్లలో మహారాష్ట్ర (రూ.19,423కోట్లు) తర్వాతి స్థానాన్ని కర్ణాటక (రూ.9,176 కోట్లు), గుజరాత్ (రూ.8,873 కోట్లు), తమిళనాడు (రూ.7,393కోట్లు), ఉత్తర్‌ప్రదేశ్ (రూ.6,519 కోట్లు) ముందుస్థానాల్లో ఉన్నాయి.





