
న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావటంతో అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 242 మంది భారతీయులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు, విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్నట్టు విదేశాంగ మంత్రి మురళీధరన్ తెలిపారు. ఉక్రెయిన్లోని భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
యుద్ధ వాతావరణం నుంచి బయటపడి స్వదేశానికి చేరుకోవడంఎంతో ఉపశమనంగా ఉందని ఓ వైద్యవిద్యార్థి తెలిపారు. కొవిడ్ సమయంలో ఉక్రెయిన్ నుంచి విమానాల రాకపోకలపై విధించిన ఆంక్షల్ని భారత్ ఎత్తివేసింది. ఈనెల 22, 24, 26తేదీల్లో మూడు ప్రత్యేక వందేభారత్ విమానాలను ఉక్రెయిన్, భారత్ మధ్య నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
Source: EtvBharat





