
తెలుగునాట సమరసతా సాహిత్యంలో మరో కలికితురాయి ఆచార్య NG రంగా వ్రాసిన ‘హరిజన నాయకుడు’ నవల వెలువడి 89 సంవత్సరాలు పూర్తయింది. ‘హరిజన నాయకుడు’ నవల అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అమృతభాండమే. హిందూ సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అస్పృశ్యతను విద్యతో, జ్ఞానంతో, సంస్కారంతో అధిగమించవచ్చు, మిగతా సమాజం నుంచి మన్నన పొందవచ్చు అని చెబుతూనే, “స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః” అని బోధిస్తుంది.
“హరిజన నాయకుడు” నవల సంక్షిప్త ఇతివృత్తం ఒకసారి తెలుసుకుందాం…..
నవల మొత్తం విజయవాడ చుట్టు ప్రక్కల కమ్మ వారు ఎక్కువగా గల వేల్పూరు, ఈడ్పుగల్లు, గొల్లపూడి….గ్రామాల కేంద్రంగా ఉంటుంది. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ, వేమూరు రాంజీ పంతులు, కొంపెళ్ళ హనుమంతరావు వంటి చారిత్రిక పురుషులు,…..ఇతర కల్పిత వ్యక్తులు నవలలో దర్శనమిస్తారు.
గంగయ్య మాదిగ కులపెద్ద. పెద్ద కూలీ. రెండవ కొడుకు లింగడు తాను చేయని తప్పుకు రైతులచే దెబ్బలు తిని మరణిస్తాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కడుపున తిరిగి జన్మిస్తాడు. అతనిపేరు ముత్తయ్య. గంగయ్య పాత తరం వాడు. అతని మంచి ప్రవర్తన వల్ల రైతులు కూడా అతని పట్ల గౌరవంతో వ్యవహరిస్తారు. అందరినీ మంచి చూపులతో చూడడం,అందరిలో మంచినే చూడడం ఇతని ప్రత్యేక గుణం.”చేనులోకి దిగి వ్యవసాయ పనులు నాట్లు, కోతలు చేసేటప్పుడు కూలీలుగా అందరూ ఉంటారు. అప్పుడు అంటరానితనం ఎవరూ పాటించరుగా?” ఇదీ గంగయ్య మనోగతం.
కొత్తగా పుట్టిన ముత్తయ్యకు అన్నీ లింగయ్య లక్షణాలే! ముత్తయ్య నూతన తరం వాడు. సమాన హక్కులు, గౌరవం కోరుకునేవాడు. దాంతో రైతులలో అలజడి బయలు దేరుతుంది. ముత్తయ్య ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోతాడు. క్రైస్తవుల సహకారంతో ఉన్నత చదువులు చవుతాడు. తమ మతంలో చేరమని క్రైస్తవ మత పెద్దలు కోరతారు. ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి పెద్దల సలహాతో క్రైస్తవ మతం తీసుకోరాదని నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయం క్రైస్తవ మత పెద్దలకు చెబుతాడు. మచిలీ పట్నంలో ఎస్సీల కోసం నడపబడుతూ ఉన్న శ్రీ వేమూరు రాంజీ పంతులు గారి పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరతాడు. న్యాయవాది అవుతాడు. ముత్తయ్యలో అక్కడి పెద్దలకు సంత్ బసవేశ్వరుడు లాగా మంచి నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. కనుక బసవలింగయ్యగా పేరు మార్చారు.
1920 లో వచ్చిన ఎన్నికలు ఈ ఎస్సీ వర్గాల ప్రజలలో ఒక కొత్త చర్చను లేవదీసింది. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం సరి కాదు, ప్రజల కోసం పని చేసే వారికే వోటు వేయాలని కొందరు వాదించారు.
1923లో బసవలింగయ్య తమ గ్రామంలోని పెద్ద లతో చర్చించి, ఒప్పించి ఎస్సీ బాల బాలికలకు గ్రామ పాఠశాలలో ప్రవేశం కల్పించాడు. ఆ చుట్టుప్రక్కల గ్రామాలలోని దేవాలయాల్లో, చెరువుల్లో ఎస్సీలకు ప్రవేశం లభించింది. బసవయ్య ఒక మంచి నాయకునిగా గుర్తింపు పొందాడు. మరి కొన్ని గ్రామాలలో రైతులు ఎస్సీలపై దాడులు చేశారు. దాడి చేసిన రైతులకు శిక్ష పడేటట్లు కేసును చక్కగా వాదించాడు. దాంతో రైతులు రాజీకి వచ్చారు. ఈ రాజీ కుదర్చడంలో రైతుల భార్యల చతురత ఉంది. చివరకు రైతులకు, ఎస్సీ లకు రాజీ కుదిరి సయోధ్య ఏర్పడింది.
కొందరు చదువుకున్న ఎస్సీ యువత పట్టణాల వైపు,ఆకర్షణల వైపు వెళ్ళ సాగారు. అలాంటి తన చెల్లెలిని సుందరిని ఒప్పించి గ్రామంలోనే ఉంచి, గ్రామ ప్రజల్లో మార్పుకు కృషి చేసేటట్లు చేశాడు. క్రైస్తవ మతం తీసుకున్న అరుంధతిని తిరిగి హిందువుగా పునరాగమనం చేయించి, ఆమెను బసవయ్య వివాహం చేసుకున్నాడు. మతం తీసుకున్న అనేక మందిని ఒప్పించి తిరిగి హిందువులుగా చేశాడు. ఇది ఆంగ్లేయ అధికారులకు కన్నెర్ర అయింది. తనతోపాటే తన చెల్లెలు వివాహం అయింది. ఆ రెండు వివాహాలకు, అన్ని కులాల వారూ వచ్చారు. మేళ తాళాలతో గ్రామం మధ్య నుండి గ్రామస్థుల సహకారంతో ఊరేగింపు జరిగింది.
మద్రాసులో సైమన్ కమీషన్ రాకను వ్యతిరేకిస్తూ మదరాసులో జరిగిన సభకు అనేక మంచి మార్పులకు కృషి చేస్తున్న శ్రీ రామకృష్ణ మిషన్ స్వామీజీ స్వామి గోపికానంద అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా బసవయ్య ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం ఈ నవలా రచయిత మనస్సును వ్యక్తం చేస్తుంది. “ఆంగ్లేయులు మీరు రెండు వందల సంవత్సరాలు మమ్మల్ని పాలించారు.మీ పాలన వల్ల మా పట్ల అంటరానితనం పోలేదు. గాంధీగారి ఉద్యమం వల్లే అనేక మంచి మార్పులు వచ్చాయి. మాకు సంపూర్ణ స్వాతంత్య్రం కావాలి.
ఎస్సీలకు ప్రత్యేక నియోజక వర్గాలు వద్దు. మేము హిందువులం.మమ్మలని హిందువుల నుండి వేరు చేయ తగదు. “ఆంగ్లేయ పోలీసులు కుట్ర పన్ని రౌడీలతో బసవయ్య పై దాడి చేయించారు. ఆంగ్లేయ అధికారుల కుట్ర వల్ల బసవయ్యకు ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. అయితేనేమి బసవయ్యను ఒక మంచి నాయకునిగా ప్రజలు గుర్తించారు. బసవయ్య కధా నాయకుడు అయ్యాడు.
సామాజిక మార్పుకు సహకరించే అనేక పాత్రలు యల్లమంద, సుశీల, రమణయ్య,…. ఇలా ఎన్నో మనకు ‘హరిజన నాయకుడు’ కనిపిస్తాయి.
రచయిత గురించి….

ఆచార్య ఎన్. జి రంగా
‘హరిజన నాయకుడు’ నవలా రచయిత ఆచార్య ఎన్.జీ.రంగా. ఆచార్య రంగా గుంటూరు జిల్లాకు చెందినవారు. భారత దేశంలోనే రైతు ఉద్యమ అగ్రేసరుడు. రాజకీయ పాఠశాలను అనేక దశాబ్దాలు నడిపారు. యువకుడుగా ఎస్సీ వాడలకు వెళ్లారు, వారితో స్నేహం చేశారు, వారితో కలిసి భోజనం చేసిన సామాజిక స్పృహ మెండుగా ఉన్నవారు. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను పొందారు.
కమ్యూనిస్టులు రైతులకు వ్యతిరేకంగా రైతు కూలీ ఉద్యమాలను నడుపుతున్న సమయమది. రైతు కూలీలు అంటే ఎస్సీలే కదా! రైతు కూలీల సమస్యలు కూడా రైతులవేనని, రైతు ఉద్యమాలను, రైతు కూలీ ఉద్యమాలను సమన్వయం చేస్తూ, రైతులను భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగస్వామ్యులను చేసిన ఘనత రంగాదే!
1924లో ప్రచురితం అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘మాలపల్లి’ నవల ప్రభావం రంగాగారిపై ఎంతో ఉంది. ఆనాడు మాలపల్లి నవలపై శ్రీ రంగా ఆంధ్రపత్రికలో వ్రాసిన నాలుగు వ్యాసాలు ప్రజలపై ఎంతో ప్రభావం కలుగజేశాయి. 4 సంవత్సరాల తర్వాత 1933లో “హరిజన నాయకుడు” అనే నవలను ఆచార్యరంగా వ్రాశారు.

మాలపల్లి నవల మహాభారతం వలె పెద్ద గ్రంధం. అనేక వైవిధ్యభరిత పాత్రలతో గ్రాంథిక భాషలో ఉంటుంది. హరిజన నాయకుడు అనే నవల తక్కువ పాత్రలతో, చిన్నదిగా ఆ నాటి గ్రామ పరిస్థితులు, రైతు – కూలీ సంబంధాలు, అస్పృశ్యత, క్రైస్తవ మతమార్పిడులు, పునరాగమనం, గాంధీజీ హరిజనోద్ధరణ ప్రభావం, స్వాతంత్ర్య సమరం ఇవన్నీ నవలలో చిత్రీకరించారు.
అస్పృశ్యత నిర్మూలన గాంధేయ మార్గంలోనే సాధ్యమని ప్రతిపాదించారు. 1933లో గాంధీజీ హరిజనయాత్రలో ఆంధ్ర ప్రాంతంలో పర్యటించినప్పుడు వారి వెంట గుంటూరు జిల్లా పొన్నూరు వద్ద తాళ్ళపాళెంలు నడచి వెళ్లారు.
1987లో కిసాన్ పబ్లికేషన్స్, గుంటూరు వారు ‘హరిజన నాయకుడు’ నవలను 50 ఏళ్ల తర్వాత పునర్ముద్రించారు.
– K. శ్యాంప్రసాద్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్.





